ప్రయాణాలదారుల్లో పరిమళించిన జ్ఞాపకాలు:తెలుగువారి ప్రయాణాలు

కొన్ని పుస్తకాలు మనం వదల్లేము.కొన్ని పుస్తకాలు మనలను వదలవు.
రెండూకలిసినవి ఎప్పుడో కానీ తటస్థించవు.అలా వదల్లేని పుస్తకం ఇటీవలికాలంలో చదివినది..”తెలుగువారి
ప్రయాణాలు”.అరవైనాలుగుమంది తెలుగు వారు జరిపిన ప్రయాణాల అనుభవాల సంకలనం ఈపుస్తకం.యాత్రాసాహిత్యానికి తెలుగు సాహిత్యంలో తగినంత గుర్తింపు,చోటూ దక్కలేదని తపించే నిత్య యాత్రికుడు ప్రొ.ఎమ్.ఆదినారాయణగారు ప్రేమతో అందించిన యాత్రాసాహిత్య గుచ్ఛమిది.సరే వారు ఈ సంకలనం రూపొందించడంలో ఒక ప్రణాళిక పెట్టుకున్నారు.వీలయినంతవరకూ అన్ని ఖండాలను దర్శించిన అనుభవాలు చోటుచేసుకోవాలనేది అందులో ఒకటి.ఇంకా కొందరి యాత్రానుభవాలను కొన్ని స్వీయచరిత్రల నుంచి సేకరించారు.ఇటీవలికాలం వారు ట్రావెలాగ్ శీర్షికతో ప్రచురించుకున్నా పాతతరం ప్రముఖులు కందుకూరి వీరేశలింగం,చిలకమర్తి, ఆదిభట్ల నారాయణదాసు,శ్రీపాద, దాశరథి కృష్ణమాచార్య, ప్రకాశం పంతులు వంటివారు స్వీయచరిత్ర ల్లోనే అన్నీ ప్రస్తావించుకున్నారు.

కథ జీవితాన్ని స్పర్శిస్తే,నవల జీవితపు లోతులను చూపితే ప్రకృతికి,మనిషికీ ఉన్న బంధాన్ని,విస్తరించిన ప్రపంచపు వింతల్నీ, మనుషుల మనస్తత్వాలను యాత్రా సాహిత్యం పరిశీలిస్తుంది..దేశదేశాల మనుషుల అంతరంగాన్ని విశ్లేషిస్తుంది యాత్రా సాహిత్యం.అందులోనూ ఒక నూట ఎనభై ఏళ్ల కాలంతెచ్చిన మార్పులు ఈ రచనలు మనకు చూపుతాయి.ఏమిటి కొలమానం ఈరచనల ఎంపికకు అంటే ఆయాత్ర పాఠకుడికి అందించిన అనుభూతి, సమాచారం,స్థలవైశిష్ఠ్యం,ఆకాలానికి సంతరించుకున్న ఆయాత్ర ప్రత్యేకత…కొంత రచనలో కనబరిచిన వైవిధ్యం..ఇలా అనేక కారణాలున్నా ప్రతి రచనా దానికదే ప్రత్యేకంగా ఉండటమే ఈ సంకలనం సృష్టించిన పరిపూర్ణత అనిపించకమానదు….

ఉదాహరణకు మొదటి కాశీయాత్ర చేసిన వెన్నెలకంటి సుబ్బారావు గారి రచన ఇంగ్లీష్ లో వెలువడ్డ తొలి తెలుగువారి ఆటోబయోగ్రఫీ(A Life Journey of Vennalakanti Soobrow) అన్న గౌరవంతో మొదటి రచనగా స్వీకరించానంటారు ప్రొ.ఆదినారాయణ.1822-23 సంవత్సరాల మధ్య వెన్నెలకంటి సుబ్బారావు కాశీయాత్ర చేస్తే ఏనుగుల వీరాస్వామి 1830లో చేశారు.సుబ్బారావుగారు తమయాత్రను ఒక అధ్యాయంగా చెబుతారు.ఈయాత్రలోనే వారు గుంటూరు సమీపంలో ఒక సతీసహగమనం చూశానని పేర్కోన్నారు.ఒళ్ళు గగుర్పొడుస్తుంది మనకు.ఆరోగ్యసమస్యలకు గాలి మార్పుకోసం వారు అంతదూరం యాత్రచేయటం విశేషమే అయినా కాశీయాత్ర కున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది.అదే వీరాస్వామి గారు వంద మందితో ఈయాత్ర చేస్తారు.దారి పొడుగు నుండే విశేషాలను వారు కళ్ళకు కట్టిస్తే చెళ్లపిళ్ల వారి కాశీయాత్ర మరో అనుభూతిని ప్రసాదిస్తుంది.మోసాలుఎలా ఉంటాయో హాస్యస్ఫోరకంగా వాడుకభాషలో చెబుతారు. కాశీలో పరిచయమయిన వందనపు నర్సయ్యతో ఆయన చేసిన తిరుగు ప్రయాణం మనలను అలరిస్తుంది.కాశీనుంచి వచ్చేటప్పుడు కావిళ్ళతో తిరిగి వచ్చే సంప్రదాయాన్ని తెలుసుకుంటాం.వారు ఈప్రయాణాన్ని1889లోచేస్తారు…

ఇక గురజాడ వెలగాడకొండ ప్రయాణం కానీ, బాపిరాజు గారి అజంతా ఎల్లోరా గుహల సందర్శనం,,చలం కొల్లేటిప్రయాణం, బుచ్చిబాబు చిన్నప్పుడు తణుకు పరిసరాల్లో పొందిన సౌందర్యానుభూతి కానీ ఒక తరహాలో ఉంటాయి.అవి నిరుత్సాహ పరిచాయి అనలేం కానీ స్థానికుల సంపర్కంలేని లోటు కనిపిస్తుంది.కొన్ని ఉద్వేగభరితమైన అనుభవాలను మనకు గోచరిస్తాయి.

దాశరథికృష్ణమాచార్యను హైదరాబాద్ చంచల్ గూడా జైలుకు తరలించిన ఘట్టం ఆయన తన “యాత్రాస్మ్రతి” లో రాసుకున్నప్పుడు మనమూ చలించిపోతాము.అలాగే బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ కొండల్లోనూ,గుట్టల్లో నూ తలదాచుకునే సందర్భం చదివినప్పుడు మనమూ ఆ బాధననుభవిస్తాం.
అదే గథర్ పార్టీ కార్యకర్తలను ఒక జైలు నుంచి ఇంకో జైలుకు మారుస్తున్నప్పుడు గథర్ పార్టీ కార్యకర్త అయిన దర్శిచంచయ్య ప్రదర్శించిన సమయస్ఫూర్తి నవ్వును పెదాలపై పూయిస్తుంది.

తెలుగు చిత్రసీమ ప్రతినిధిగా 1964లో అక్కినేని అమెరికా యాత్ర కానీ,భారతీయ బృందం సభ్యురాలిగా టంగుటూరి సూర్యకుమారి 1952లో చేసిన అమెరికా యాత్ర భిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి.
ఇక నాయని కృష్ణకుమారి గారి కాశ్మీర్ దీపకళిక సౌందర్యాన్ని ప్రతిఫలిస్తే,ముదిగంటి సుజాతా రెడ్డి గారి ఈజిప్టు యాత్ర పిరమిడ్ల పై సమగ్ర సమాచారాన్నిస్తాయి.బసవరాజు రాజ్యలక్ష్మి గారు అప్పారావు గారితో కలిసి చేసిన సేవాగ్రాం యాత్ర ఒక సున్నితమైన అనుభవాన్ని పొందుపరుస్తుంది.ఉద్యోగవిధుల్లోభాగంగాఒడిస్సా అడవుల్లో ఉన్నభర్తను వెతుక్కుంటూ ఒంటరి ప్రయాణం చేసి భర్తను చేరుకున్నా అనారోగ్యంతో భర్త మరణించిన అనుభవాన్ని రాయటమెంత కష్టం.. ఏడిదము సత్యవతి గారు ఆ ప్రయాణం మొత్తాన్ని వివరిస్తారు. అడవిప్రజల ఆదరాభిమానాలు తెలుసుకుంటాం.
నేటి భానుమతి తొలిసారి నటించడానికి కలకత్తా వెళ్ళారంటే నమ్మగలమా.ఆ అనుభవాన్ని చాలా అందంగా చెబుతారావిడ.ఒక టోపీవాలా మధ్యవర్తిగా వస్తాడు దర్శకుడు పుల్లయ్య గారి పక్షాన.భానుమతిగారి చతురత ఎక్కడుందంటే చివరి వాక్యంలో ఉంటుంది.ఆ టోపీవాలా నటుడు రేలంగి అని చమత్కారంగా వివరిస్తారు.

సైకిల్ సంపాదించడం కోసం నటుడు పద్మనాభం కన్నాంబ గారింట్లో తేలతాడు.పద్యాలు అందంగా పాడి ఆవిడ అభిమానాన్ని సంపాదించుకున్నారు..
స్థానం నరసింహారావు గారి రంగూన్ యాత్రకూడా కుతూహలాన్ని కలిగించేదే.అక్కడ ఒక నాటక ప్రదర్శనలో కలిగిన అపశకునాన్ని ఆయన ఎలా అధిగమించి అత్యున్నత ప్రదర్శన ఇచ్చారో ఆయన చెప్పే తీరు మనకో పాఠంలాంటిది.అప్పు తీర్చడం కోసం జగన్నాధయాత్రచేస్తుంది ఆదిభట్ల నారాయణదాసు గారి కుటుంబం1875లో..దాదాపు పదహారు నెలల ప్రయాణం.ఆదిభట్లనారాయణదాసు గారు పిల్లవాడు.అందులోని కష్టనష్టాలు ఆశ్చర్యపరిచేవే.

కోలాశేషాచలకవి “నీలగిరి యాత్ర”తెలుగు వారి మొదటివిహార యాత్రా రచనగా పేర్కొంటారు.1846లో ఆయన మద్రాసు గవర్నర్ ట్విడేల్ దొర పరివారంతో బయల్దేరారు.నీలగిరికొండలు అంటే ఊటీ పరిసరాలను,వాతావరణాన్ని,చలిప్రదేశపు కష్టాలను వారు వివరించిన తీరు చాలా సూక్ష్మంగా ఉంటుంది..

చదువునిమిత్తం లండన్ వెళ్ళిన ఉప్పలలక్ష్మణరావుగారి అనుభవం (1920)అప్పటిరోజుల్లోని జాగర్తను తెలియచేస్తుంది.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఖమ్మంమెట్టు ప్రయాణం (1917)ఆయనలోని తెలుగుదనాన్ని చూపుతూ ఆయన కృతజ్ఞత ప్రకటించిన బుకింగ్ క్లర్క్ ని చూద్దామన్నంత ప్రేమకలుగుతుంది.

శ్రీ శ్రీ చైనాయానం(1976)ఆరుద్ర గారి అమెరికా ప్రయాణం (1987), ఆచార్య ఎన్.గోపి మారిషస్ యాత్ర (1996) కవుల వచనం ఎంత సౌందర్యాన్ని ప్రకాశిస్తాయో చెబుతాయి.కాస్త భిన్నంగా ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అమెరికా యాత్ర (2002) కవితాత్మకంగా సాగుతుంది.ఇదే బాణీలో తన యాత్రా రచన చేస్తారు జె.బాపురెడ్డి..

ఒక ఎడిటర్ ని కలుసుకోవటం సంజీవ్ దేవ్ చేసిన అల్మోరా ప్రయాణం డీటెయిలింగ్ పట్ల ఆయన ఆసక్తిని వ్యక్తపరుస్తుంది.ఈ ప్రయాణం వారు 1940లో చేశారు..కంచర గాడిద లే అక్కడ ప్రధాన రవాణా గా ఉండటం మనలను ఆశ్చర్య చకితులను చేస్తుంది..

కాళోజీ 1947లో పివి.నరసింహారావుగారితో కలిసిచేసిన బొంబాయి ప్రయాణంలో పృథ్వీరాజ్ కపూర్ హిందూ ముస్లిం మైత్రి కోసం ప్రదర్శించిన దీవార్ నాటకం చూస్తారు.జోలె పట్టి నిలుచున్న పృథ్వీరాజ్ కపూర్ కి ఉన్నదంతా ఇచ్చేసిన సంఘటన కాళోజీ ఉద్వేగాన్ని చూపుతుంది..

గంగానది పుట్టిన గంగోత్రికి ఎగువనున్న గోముఖం దర్శించిన అనుభూతి స్వామి ప్రణవానంద (1934)మాటల్లో విన్నప్పుడు ఆ ప్రయాణం లోని కష్టాన్ని ఎలాతట్టుకున్నాడీయన అనిపిస్తుంది.ఎముకలు కొరికే చలివాతావరణం..అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలను దాటిన స్వామి ప్రణవానంద అసలుపేరు కనకదండి సోమయాజులు.. లాహోర్ లోని దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్ విద్యార్థి..గంగోత్రి ..గోముఖ్ మధ్య గగుర్పొడిచే వాతావరణంలో అన్ని ఋతువులను చూడాలని సంకల్పించి తన కోరిక నెరవేలర్చుకున్న ధీశాలి..
అదే మానససరోవర్ యాత్ర(1983)చేసిన పి.వి.మనోహరరావుగారిలో సామాన్యుడి డైలమా కనిపిస్తుంది.

ఏకాంతాన్ని వెతుకుతూ 1917లో గోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైన గొరగనమూడి ని వీడిన స్వామి జ్ఞానానంద అసలు పేరు భూపతిరాజు లక్ష్మీ నరసింహ రాజు.తదనంతరకాలంలో భౌతిక శాస్త్రవేత్తగా
మారిన ఈ అన్వేషి యాత్ర స్ఫూర్తిమంతంగా సాగుతుంది.
1944లో హరప్పా,మొహెంజొదారోలను దర్శించి తన అనుభవాన్ని రాసిన తిరుమల రామచంద్ర వందపౌన్ల గోధుమ పిండి పేదవాడికి దానంచేసినందుకు లాహోర్ లోని ఆర్మీ కోర్టు మార్షల్ ఎదుర్కొని రాజీనామా చేసిన సందర్భమది.
రాజీనామా కు ఆయన తన డాక్టర్ మిత్రుణ్ణి మతి స్థిమితంలేదన్న కారణం చూపమని కోరతాడాయన.
ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయనలోని పట్టుదల అలాబయటకు వస్తుంది..
అది హరప్పా,మొహింజొదారోల పర్యటనల విషయంలో మనం గమనించవచ్చు..

2010వ సంవత్సరంలో డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కులదీప్ నాయర్ బృందంలో ఒకరిగా పాక్ శాంతియాత్రచేసిన అనుభవాన్ని కూడా ఇందులో చేర్చారు.. 1923మార్చి 23వతేదీన లాహోర్ నగరం లో భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్లను ఉరితీసిన రోజు.. తిరిగి అదే మార్చి 23వ తేదీన వారక్కడున్నారు.భగత్సింగ్ కు అంజలి ఘటించిన వేలాదిమంది ప్రజలలో మేముండటం మర్చిపోలేని ఘటన అంటారు వారు..

ప్రతి వ్యాసమూ ఒక అనుభవాన్నో ఒక అనుభూతినో మనతో పంచుకుంటుంది.ఒక కొత్త అంశాన్ని మనకు పరిచయం చేస్తుంది.1957లో పెకింగ్ నుంచి మాస్కోకు తొమ్మిది రోజుల రైలు ప్రయాణం వివరాలను ఎంతో ముచ్చటగా మనకందిస్తారు బి.ఎస్.ఎన్.మూర్తి.సైబిరియా ఎడారి ప్రయాణం,కాలం తెచ్చిన మార్పులు ఆశ్చర్యం గొలుపుతాయి.పెకింగ్-మాస్కో ప్రయాణం మనంచేసినట్టే అనుభూతిస్తాం
ఇలాంటి ప్రయాణమే మరొకటి కురుమెళ్ళ వెంకట్రావు గారిది.. 1930లోవారు స్టీమర్ పై పిఠాపురం రాజావారితో ఐరోపా ప్రయాణం చేస్తారు.వారు తమమిత్రులైన పెమ్మరాజువెంకటరావుగారికి ఈ విశేషాలను ఉత్తరాలు ద్వారా తెలియపరుస్తారు.చిన్నచిన్న విషయాలతో సహా ఏడంతస్తుల స్టీమర్ ను మనముందు ఉంచుతారు.సూయజ్ కాలువను దాటుతూ ఆ కాలువ ఏవిధంగా దూరాన్ని తగ్గించింది మొదలు కాలువ స్వరూపాన్ని కళ్ళకు కట్టిస్తారు.
ఇదొక విశేషమయితే అత్యం నర్సింహమూర్తి గారు కూడా ఓడ ప్రయాణం చేసి బర్మా,మలయా, సింగపూర్, చైనా దేశాల మీదుగా అమెరికా చేరుతారు.ఇక్కడ వీరు 1929-32 సంవత్సరాల మధ్య చేసిన యాత్రా విశేషాలను తన భార్య సత్యకు ఉత్తరాల రూపంలో తెలియచేస్తారు.

జమిల్యా రచయిత చెంఘీజ్ ఐతమోవ్ జన్మించిన కిర్గిజ్ స్థాన్ లో కొన్నాళ్ళు గడిపిరావాలన్న తలంపుతో యాత్ర చేస్తారు పరవస్తు లోకేశ్వర్
కిర్గిజ్ స్థాన్ రాజధాని బిష్కెక్ లో అడుగుపెట్టిన ప్రతి క్షణాన్ని అక్షరబద్ధంచేస్తారు.అక్కడ ఆయనకు తెలుగు మిత్రులు తటస్థిస్తారు.ఆసక్తికరంగా యాత్రా విశేషాలందిస్తారువారు.2012లో వారు ఈయాత్ర చేశారు.

ఇక రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి 2011లో చేసిన దుబాయ్,గ్రీస్,టర్కీ దేశాల ప్రయాణంలో టర్కీ దేశ విశేషాలను వివరంగా మనకు తెలుసుకుంటాం.ముఖ్యంగా టర్కీ దేశపు గతి మార్చిన ఆదేశాధ్యక్షుడు ముస్తాఫా కెమెల్ అటా టర్క్(1926)గురించి ఆయన చెప్పిన తీరు ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ సంకలనంలో అతి పిన్న యాత్రికుడు గౌతంరెడ్డి నల్లావారి.. సిల్క్ రూట్ లో యాత్రచేసిన తెలుగు వాడు.అటు ఆసియాకు,ఇటు ఐరోపాకు మధ్యలో ఉన్న సమర్ఖండ్ నగరాన్ని చారిత్రక వైభవాన్ని చెప్పే వ్యాసం అనేక అంశాలను మనకు పరిచయం చేస్తుంది.మధ్యయుగాలనాటి “మాన్ హాటన్” అని వర్ణిస్తారు.యాత్రాకాలం 2012..
రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ గారి పెరూ దేశ పర్యటన లో పాల్గొన్న సంపాదకులు వేమూరి బలరాం గారి వ్యాసం నారాయణన్ గారి మూర్తిమత్వాన్ని సున్నితంగా పరిచయం చేస్తుంది.పెరూదేశాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి శ్రీ కె.ఆర్.నారాయణన్.పూర్వరంగంలో జర్నలిస్టు గా ఉన్న నారాయణన్ మహాత్మా గాంధీ మౌనదీక్షలో ఉన్నప్పుడు ప్రశ్నలు లిఖితపూర్వకంగా తెలియచేసి సమాధానాలు పొందిన అనుభవశీలి అని వర్ణిస్తారు రచయిత.

కవనశర్మ గారి ఇరాకీడైరీ కూడా చాలా ఆసక్తికరంగా కాల్పనిక సాహిత్యమంత ఉత్తేజంగా సాగుతుంది.1986లో మోసూల్ పట్టణంలో అక్కడి స్థానిక యూనివర్సిటీ లో బోధించారు వారు కొంతకాలం.ఇరాకీలు,కుర్దుల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో కుర్దుల మర్యాదలను వివరిస్తారు వారు.
లోధ్ర సృష్టికర్త కె.ఎన్.కేసరిగారు మద్రాసు నుంచి ఒంగోలు పడవ ప్రయాణం ద్వారా చేరేవారు.1895లో ఆ ప్రయాణం ఖరీదు రూపాయి.పది, పదకొండు రోజుల పాటు సాగే ఆ ప్రయాణం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు
1886-87 సంవత్సరాల్లో తమ గురువుగారు హనుమంతనాయుడుగారితో కలిసి చేసిన రాజమహేంద్రవరం ప్రయాణ ఘట్టాన్ని తమ ఆత్మకథలో వివరిస్తారు.ఆ ప్రయాణం వారి జీవితాన్ని మలుపు తిప్పిన ప్రయాణం.. బకింగ్ హాం కాలువ ప్రయాణం లేని ఎండాకాలం లో ఎడ్ల బళ్ళపై బెజవాడ ప్రయాణం.. అక్కడినుంచి రాజమండ్రి కి మళ్ళీ ఎడ్ల బళ్ళ ప్రయాణం చేయటం..దీన్నీఅంచెబళ్ళ ప్రయాణమంటారుట.మధ్యమధ్యలో మకాముల వద్ద ఆగటం..అంటే సత్రాల వద్ద..ఆ ప్రయాణం నేపథ్యాన్ని దానికి కారణభూతులై…తనని తీర్చిదిద్దిన వ్యక్తి హనుమంతరావు నాయుడు మాస్టారు అని వారు గుర్తుచేసుకున్న సందర్భాన్ని చదువుతాం ఈ భాగంలో..

చివరి వ్యాసం ఈ సంకలనంలో ప్రొ.ఆదినారాయణగారిది.వారి స్వీడన్ యాత్ర లో బాగంగా స్టాక్ హోం నొబెల్ అకాడెమీ లో ప్రసంగించవలసి ఉంటుంది.ఆ సందర్భంలో ఆయన తన పెయింటింగ్స్ ప్రదర్శన నిర్వహించారు.అది అక్కడి మిత్రులు లూసియన్,అలీసాలతో పరిచయానికి దారి తీస్తుంది…లూసియన్ మంచి పెయింటర్,అలీసా మంచి గాయకురాలు.స్వీడెన్ దేశ ప్రకృతిలో మమేకమయిన క్షణాలను ఆర్ద్రంగా గుర్తు చేసుకుంటారు వారు.జిప్సీల గురించి సమాచారం కూడా అందిస్తారు మనకి.సరళంగా ఉండి హత్తుకునే వాక్యం ఆదినారాయణ గారిది..

ఇంకా ఈ సంకలనంలో రావూరి భరద్వాజ, పర్వతనేని ఉపేంద్ర,భూమన కరుణాకరరెడ్డి,చినవీరభద్రుడు,దాసరి అమరేంద్ర మొదలైన వారి వ్యాసాలు పాఠకుడిని ఆకర్షించేవే…
సంకలనకర్త వ్యాసకర్తలను తీర్థయాత్రికులు,కవులు, రచయితలు, పండితులు,సౌందర్యారాధకులు,ప్రపంచయాత్రికులు,ప్రజానాయకులు అని వర్గీకరించినా యాత్రలో ప్రధానంగా స్థానికులతో పరిచయాలు,ఆ ప్రాంత ప్రత్యేకతను గమనించి మాటల్లో పెట్టిన తీరే మనకళ్ళను అక్షరాలవెంట పరిగెత్తించేది..ఎవరి అనుభవం వారిదే..ఎవరి కష్టాలు వాళ్ళనే..అందులో సందేహంలేదు..కథకన్నా,నవల కన్నా మిన్నగా హత్తుకునేవే ఈవ్యాసాలు..అలా నేను మళ్ళీ మళ్ళీ చదువుకున్న వ్యాససంకలనం తెలుగు వారిప్రయాణాలు.. మనందరికీ యాత్రలు చేయాలనుంటుంది.అనేక కారణాలు వలన చేయలేకపోతాం.అయితేనేం ఈ యాత్రా రచనలన్నీ ఆకొరత తీర్చి మనలోని సాహిత్య దాహాన్ని పెంచుతాయి..మనలనూ గతం వర్తమానాల సాక్షిగా విశ్వయాత్రికులను చేస్తాయి.. యాత్రా రచనల ప్రత్యేకతే అది..ఈసంకలనంలోని చాలా వ్యాసాలు అందుబాటులో లేవు.మరి ఆదినారాయణ గారు వాటికోసం ఎంత శ్రమించిఉంటారో ఊహించుకోవచ్చు..నిజం చెప్పాలంటే ఆ పుస్తకాలన్నీ ఏదోరకంగా పాఠకుడికి లభ్యమవ్వాలని ఆశిద్దాం.. అంతకుముందు అందుబాటులో ఉన్న ఈ పుస్తకం కొంత మనదాహాన్ని తీరుస్తుంది

సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *