నేనెరిగిననాన్నగారు “గాన గంధర్వుడు ఘంటసాల”

డా. శ్యామల ఘంటసాల గారి రచన. తన తండ్రిగారైన #ఘంటసాల గారి జీవితాన్ని, తాను తెలుసుకున్నది విన్నది, తన స్మృతిలో ఉన్నవారి జ్ఞాపకాలను మనతో పంచుకునే ప్రయత్నం చేశారు ఆవిడ.

ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే ఇది మొత్తం వీరి స్వీయ దస్తూరిలోనే ఉండడం. ఈ పద్దతి ద్వారా
తన తండ్రి గారి జీవితాన్ని స్వయంగా పాఠకులకు పంచడంలో ఒక పర్సనల్ టచ్ కనిపిస్తుంది. గాన గంధర్వుడు ఘంటసాలని మరో రెండుతరాలు
కూడా జ్ఞాపకం ఉంచుకుంటాయి.తెలుగు పాట
బ్రతికి ఉన్నంత కాలం వీరిని మరవడం కష్టం.

అందరికి సుపరిచితులయిన ఘంటసాల గారు కటిక పేదరికం అనుభవించారని బిచ్చమెత్తుకుని కొన్ని రోజులు విజయనగరంలో ఉండవలసి వచ్చిందని వారాలు చేసుకుంటూ సంగీతాన్ని అభ్యసించారని చదువుతుంటే అప్పటి తరం కష్టాలు అర్ధం చేసుకుని కళ్ళు చెమర్చకమానవు. తండ్రి గారి మరణానంతరం సంగీతాన్ని బోధించేవారు లేక ఘంటసాల మాస్టారు విజయనగరం వచ్చి అక్కడ మహారాజా వారి కళాశాలలో సంగీత విద్వాన్ పరీక్ష పాస్ అయ్యారు.

వీరిని ఆదుకున్న మిత్రులు ముద్దు పాపారావు, వేశ్య వృత్తి చేసుకునే సరిదెల లక్ష్మీనరసమ్మ గార్లు. వీరిని ఘంటసాల గారు చివరి వరకు స్మరించుకుంటూనే ఉన్నారు. వీరి జీవితంలో ఊహించని ఎత్తుపల్లాలున్నవి. తనను ప్రేమించిన జమిందారి అమ్మాయి కమలని పెళ్ళి చేసుకోలేని అశక్తత ఆమె తన అత్తవారింటిలో ఆత్మహత్య చేసుకోవడం వీరిని వేధించిన విషయాలు. సావిత్రి గారితో వివాహం అనంతరం వీరికి మద్రాసులో పరిచయమయిన
మరో స్నేహితురాలి కుటుంబం ఇతనిపై మరో వివాహానికి ఒత్తిడిని తేవడం, దానిని దాటుకున్న తరువాత నాయిడుగారి అమ్మాయి సరళ వీరిని
కోరి మరో వివాహం చేసుకోవడం కొంత ఆశ్చర్యపరిచే విషయాలే. అయితే ఈ రెండు వివాహాల చట్రంలో
వీరు ఆఖరిరోజు దాకా నలిగిపోయారని చదివినప్పుడు కొంత బాధ వేస్తుంది. నేటికి
కూడా ఎందరికో మనశ్శాంతిని కలిగించె ఎన్నో అద్భుత గీతాలు పాడిన వీరు జీవితంలో మనశ్శాంతి లేకుండా నలిగిపోవడం బాధ కలిగించే విషయమే.

డబ్బు కన్నా పేరు కన్నా పాటకి ప్రాణమిచ్చిన ఘంటసాల గారు కవి, మ్యూజిక్ డైరెక్టర్ల కష్టాన్ని ఎరిగి ఎంతో వినయంతో ఆఖరి దాకా తనకు అప్పగించిన పాటకు న్యాయం చేయాలని
తపించేవారట. హెచ్.ఎమ్.వీ కంపెనీ వీరి
గాత్రం రికార్డింగుకు పనికిరాదని నిర్ణయిస్తే,
వీరిని ప్రోత్సహించిన శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు, పేకేటి శివరాం గారు, శ్రీ సముద్రాల రాఘవాచారి గార్లను వీరు చివరి దాకా స్మరించుకుంటూనే ఉన్నారు.

మొదటి భార్య సావిత్రీ గారితో ఐదుగురు సంతానం, రెండొ భార్య సరళ గారితో ముగ్గురు సంతానం వీరికి. కాని ఇరు కుటుంబాలు వేరు వేరుగా ఉండడం, భార్యల పట్టుదలల మధ్య నలిగిపోయిన జీవితం వీరిది. చివరి దాకా బిడ్డలకు పూర్తి న్యాయం
చేయలేకపోయానని భాధపడుతూ ఉండే వారట. తిరుపతి దేవస్థానం ఆస్థానగాయకునిగా నియమించబడినప్పుడు సాక్షాత్తూ అన్నమయ్య ఆలాపించిన చోటే కచేరీ చేసే అదృష్టం వచ్చిన ఏకైక గాయకుడు ఘంటసాల. ఆఖరి రోజులలో భక్తి ముక్తి కోసం తపించి సినిమా పాటలు మానివేసి కేవలం భక్తి గీతాలు మాత్రమే ఆలపించాలనీ నిర్ణయించుకున్నారట.

బీపీ. షుగర్ వ్యాధులతో శరీరం కృశిస్తుంటే ఎవరో తెలీని వ్యక్తి ఇచ్చిన నాటు మందు తాగి గొంతు పాడయి నరకం చూడడం, వీరి అభిమానులు
జీర్ణించుకోలేని విషయం. తన శరీరం నుండే వచ్చే దుర్గంధం నుండి ఇతరులను కాపాడడానికి సొంత పిల్లలనే దగ్గరకు రానీయకుండా ఒంటరిగా రోజులు గడిపారట. చివరకు గొంతు బాగయి హాస్పిటల్ లోనీ నిర్మాతల కోసం రిహార్సల్సు చేసి పాటలు రికార్డు చేసి రేపు డిశ్చార్జు అయ్యి వెళ్తారనగా హార్ట్ అటక్ తో కన్ను మూసారు.

అన్నిటి కన్నా ఆశ్చర్యం వీరి ఆఖరి చూపులకు తెలుగు దేశం ఇద్దరు హీరోలు ఎన్.టీ. ఆర్..
ఏ.ఎన్. ఆర్ వెళ్ళకపోవడం. షూటింగ్ కారణంగా రాలేక తన తమ్ముడిని ఎన్.టీ.ఆర్. పంపితే, ఇప్పుడు వచ్చి నేను చేసేదేం ఉంది, నా కోసం చూడకుండా అన్ని ముగించండి అని
ఏ. ఎన్. ఆర్. గారు కబురు చేసారట.
” ఏ ఇద్దరికి తన గొంతుతో జీవం పోసారో వారిద్దరూ వీరి అంతిమ వీడ్కోలుకి లేకపోవడం బాధాకరం. అయితే కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావు, పేకేటి శివరాం, ప్రభాకర్ రెడ్డి గార్లు అన్ని విషయాలు చూసుకున్నారని ఆవిడ రాసుకున్నారు.

తాను రికార్డు చేసిన భగవద్గీత రీలీజు కాకుండానే వీరు మరణించారు. ఏమైనా అంత గొప్ప గాయకుడు జీవించవలసిన జీవితం కాదు అనిపించింది ఈ పుస్తకం చదువుతుంటే. క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గోన్నా, తనను అభిమానించే వారికోసం కచేరీలు చేసినా, బంధువులు, స్నేహితుల పిల్లల భాధ్యత తీసుకున్నా, ఉస్తాద్ శ్రీ బడే గులాం అలీ ఖాన్ గారిని తన మానస గురువుగా స్వీకరించినా తన మనసుకు నచ్చినది చేసుకుంటూ వెళ్ళీ ఆ కష్ట నష్టాలకు స్వయంగా భాద్యత తీసుకునే వ్యక్తిత్వం వీరిదిగా కనబడుతుంది. పుట్టపర్తి సత్యసాయి గారిని నమ్ముకుని, పుష్పగిరి స్వాముల వారి కంచి స్వాముల వారి సాంగత్యాన్ని పొందిన భక్తిభావం వీరికి డబ్బుని తృణప్రాయంగా చూసే ధైర్యాన్ని ఇచ్చింది. గుడిలో భజనలు చేస్తూ అక్కడ పెట్టే ప్రసాదంతో తన వృద్దాప్యాన్ని గడపాలని అనుకున్న వీరిలోని వైరాగ్యం మనసును పిండేస్తుంది. ఎంతో బాధతో చదివిన పుస్తకం ఇది. ఇందులోని ఎన్నో సంగతులు నాకు తెలీనివి కాబట్టి కొంత బాధ, ఆశ్చర్యం కలిగాయి ఇది చదువుతున్నంత సేపూ కూడా…

తెలుగు సినీ గీతాన్ని, సంగీతాన్ని సుసంపన్నం చేసిన మహా గాయకుడు ఘంటసాల. ఘంటసాల పేరుని, పాటని వినని తెలుగువారుండరేమో. ఆయన వ్యక్తిత్వం కూడా ఆయన పాటలానే ఎంతో ఉన్నతమైనదని ఎందరెందరో ప్రసిద్ధుల మాటల్లో వింటూనే ఉంటాం. ఆ మధురగాయకుని జీవిత విశేషాల మాలికే – ‘నేనెరిగిన నాన్నగారు’.

ఈ పుస్తకం రాసింది ఘంటసాల గారి అమ్మాయే కనుక ఘంటసాల గారి సినీ జీవితం గురించే కాక వ్యక్తిగత జీవితం గురించి కూడా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

సేకరణ
– సుగుణ గారు