చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు. తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి, అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు. తెలుగువాడు తనకే సొంతమని చెప్పుకోదగ్గ అవధాన విద్యను జనరంజకం చేసి జగద్విదితంగా మార్చిందీ ఈ కవితా ద్వయమే.

వీరిలో ప్రథములు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియంలో 1870 ఆగస్టు 8న జన్మించారు. చంద్రమ్మ, కామయ్యలు తల్లిదండ్రులు. ఆర్థికస్థితి సరి లేకపోవడం, కాలు కుదురులేనితనం వల్ల చదువు ఎక్కడా సాఫీగా సాగలేదు. కుటుంబ మకాం యానాంకు మారడంతో అక్కడే తెలుగు, సంస్కృతం, ఆంగ్లవిద్య నేర్చుకున్నారు. చినతాత చెళ్లపిళ్ల మునిశాస్త్రి రాసిన తాళపత్ర గ్రంథాలు చదవడం ద్వారా వేంకటశాస్త్రికి బాల్యం నుంచీ ఆంధ్రసాహిత్యం మీద పట్టుఉండేది. వీధినాటికలు, బుర్రకథలు రాశారు. 17 ఏళ్లప్పుడు యానాం వేంకటేశ్వరుడిపై శతకం రాశారు. కొందరు ఆయన తప్పులను ఎత్తిచూపుతూ సంస్కృతమాసత సంధి గురించి ప్రశ్నించారు.

ఆంధ్ర వ్యాకరణం తప్ప సంస్కృత వ్యాకరణం అంతగారాని చెళ్లపిళ్లను ఈ సంఘటనే కాశీయాత్ర బాట పట్టించింది. కంటి వైద్యానికని ఇంట్లో చెప్పి, ఓ మిత్రుడితో కలిసి కాశీకి బయలుదేరారు. చేతిలో డబ్బులేదు. నిడమర్రు చేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంటకవనం చేయగలనని ప్రగల్భంగా పద్యాలు చెప్పారు. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్లే. కూత ఘనంగా ఉందని అష్టావధానం చేయించారు. అవధానం పూర్తిచేసి- ‘అయ్యా నేనెప్పుడూ అష్టావధానం చేయలేదు, ఊరక అడిగిన ధనమీయరని ప్రగల్భములు పలికితిని. లోపములున్న మన్నింప’మని వేంకటశాస్త్రి పలికారు. కోపం లేదని, బాగా చేశావని చెప్పి వారు ముప్ఫై రూపాయలిచ్చి వేంకటశాస్త్రిని సత్కరించారు.

కాశీ వెళ్లి పలువురు పండితుల వద్ద వ్యాకరణ, తర్క శాస్త్రాలు, వేద భాగం, సంస్కృత కావ్యాలు, బ్రహ్మసూత్ర భాష్యం, సంస్కృత ఛందస్సు నేర్చుకున్నారు. కొంతకాలం రాజమహేంద్రవరంలో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కడియద్దలో చర్ల బ్రహ్మయ్యశాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరారు. అప్పటికే ఆయనవద్ద దివాకర్ల తిరుపతి శాస్త్రి కౌముది నేర్చుకుంటూ శిష్యుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య విద్యాస్పర్ధ ఎక్కువగా ఉండేది. వీరి ఉత్సాహాన్ని గమనించిన గురువు- ‘మీరిద్దరూ ఒకటైతే తెలుగు సాహిత్యంలో మీకు సాటి రాగలవారుండ’రని హితవు పలికారు. అప్పటి నుంచి ఇంటిపేర్లు తీసేసి, సొంతపేర్లు కలుపుకొని తిరుపతి వేంకట కవులుగా సాహితీ సమరం ప్రారంభించారు. తొలి శతావధానాన్ని 1892లో కాకినాడలో జరిపి గండపెండేరాలు తొడిగించుకుని, గజారోహణంతో జయపతాక ఎగురవేశారు. ఎన్నో రాజాస్థానాలు, సంస్థానాలు సందర్శించి సత్కారాలు అందుకున్నారు.

ఇద్దరు కుర్రాళ్లు దిగ్గజాల్లాంటి మహా పండితులను ఓడించడంతో వారి కీర్తి దినదిన ప్రవర్ధమానమైంది. వేంకటశాస్త్రి ఒక పాదం చెబితే, తిరుపతి శాస్త్రి మరోపాదం చొప్పున అలవోకగా పద్యాలు చెప్పేవారు. నవ్యత, హాస్యం, చమత్కారం రంగరించి పదగుంభనంతో పద్యాలు చెబుతుంటే అందరూ చెవులు రిక్కించి వినేవారు. వీరి శతావధాన జైత్రయాత్ర తెలుగునాట అవధాన ప్రక్రియ ప్రాచుర్యానికి నాంది పలికింది.
సాధారణంగా కవులు, సాహితీవేత్తలు మీసాలు పెంచరు. మెలితిరిగిన మీసాలతో వీరు రాజాస్థానాలకేగేవారు. ‘ఒకవైపు మీసం తెలుగు సాహిత్యం, మరోవైపు మీసం సంస్కృత సాహిత్యానికి ప్రతీకలు’ అనేవారు. రెండింటిలో ఎవరైనా తమను ఓడిస్తే మీసాలు తీసి, గెలిచినవారి పాదాల చెంత ఉంచుతామని సవాలు విసిరిన పండిత పరాక్రములు ఈ మీసకవులు.

పద్య నాటకం ఎనలేని ఆదరణ సంతరించుకుందీ వీరితోనే. ఆ పద్యాలు వినగానే దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. తిరుపతి శాస్త్రి 1920లో కాలంచేశారు. ఆపై వేంకటశాస్త్రి 30ఏళ్లు జీవించారు. ఈ కాలంలో తన రచనలను ఇద్దరూ రాసినట్లుగా ‘తిరుపతి వేంకటీయం’ అని పేర్కొన్నారు. బంధ, గర్భ, చిత్ర, విస్తార కవితలతో కోకొల్లలుగా గ్రంథాలు వెలువడుతున్న రోజుల్లో కండకలిగిన భాషలో వ్యావహారిక పలుకుబడిని గ్రహించి చెళ్లపిళ్ల రచనలు సాగించారు. ఒకవైపు సంప్రదాయ కవిత్వం చెబుతూనే ఆధునిక కవిత్వానికి చెళ్లపిళ్ల సముచిత ప్రాధాన్యమిచ్చారు. దళితులు సాహిత్యానికి దూరంగా ఉండాలని చెప్పే ఆ రోజుల్లో గుర్రం జాషువా కవిత్వానికి అబ్బురపడిన వేంకటశాస్త్రి ఆయన కాలికి గండపెండేరం తొడిగారు.

బోధనలో తనకున్న మక్కువతో వేంకటశాస్త్రి బందరు పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరి, చాలాకాలం పనిచేశారు. విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి, వేలూరి, స్వాతంత్య్ర సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మ ఆయన శిష్యపరంపరే. 1949లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం చెళ్లపిళ్లను తొలి ఆస్థానకవిగా నియమించింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం చెళ్లపిళ్లను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది! తెలుగు సాహిత్య చరిత్రలో వీరికి ముఖ్యంగా చెళ్లపిళ్లవారికి ఉన్నన్ని వివాదాలు మరే కవులకూ లేవు. ఎందరో సాహితీవేత్తలతో వాద ప్రతివాదాలు జరిపారు. గద్యంలో, పద్యంలో ఖండన మండన గ్రంథాలు వారి కర్తృత్వంలో వచ్చాయి. కొప్పరపు కవులతో వివాదాలను ‘గుంటూరి సీమ’ పేరిట గ్రంథరూపంలో పదిలపరచారు. వేంకట పార్వతీశ కవులతో, చివరికి గురువు శ్రీపాదవారితోనూ పెద్ద సంవాదమే నడిచింది. అవి న్యాయస్థానాల వరకూ వెళ్లాయి. ఏనుగులెక్కించి సన్మానించిన సాహిత్యమే కోర్టు మెట్లూ ఎక్కించిందని స్వయంగా ప్రకటించుకున్నారు. తన 80వ పడిలో 1950 మహాశివరాత్రి పర్వదినం15 ఫిబ్రవరిన శివైక్యం పొందారు వేంకటశాస్త్రి..

Source: Internet