జలపాతం

అది వాన కాలం….వర్షాలు పడ్తున్నాయి…వాగులో చేపలు పట్టి మా తాత, నేను, ఎఱ్ఱొడు తిరిగి గూడెం కి వస్తన్నం. ఆ ఎర్ర బురద రోడ్డు లో ఒక తెల్ల కారు ఎదురొచ్చింది. ఓ యాబై ఏళ్ల వయస్సు వుంటది. తల నెరిసిన ఓ పెద్దాయన కారు దిగి మా తాత దగ్గరికి వచ్చి ఎదో అడుగుతున్నాడు…

వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికి మా తాత ఆ మనిషిని చూపిస్తా ఈయనికి జలపాతం అంటా సుపించు అన్నాడు. చేతిలో వున్న నా చేపల బుట్టని ఎఱ్ఱొడికి ఇచ్చి జలపాతం వైపు బయలుదేరా… కారు పక్కనాపి ఆ మనిషి నన్ను వెంబడించాడు…

మూడు మైళ్ళు లోయలో దిగి అడివి లోగుండ నడిచాక జలపాతం చూసి ఆ మనిషి ఆనందం తో ఎగిరి గంతేశాడు.

జలపాతాన్ని  వీడియో తీసి సాయంత్రానికి ఆ పెద్ద మనిషి తిరిగెళ్ళి పోయాడు…

వారం రోజుల తర్వాత శనివారం పొద్దున్నే నాలుగు కార్లల్లో ఓ పది పన్నెండు మంది జలపాతం చూట్టానికి వచ్చారు….వాళ్ళల్లో ఆ పెద్దమనిషి కూడా ఉన్నాడు…

నా దగ్గిరకి వచ్చి మళ్ళీ జలపాతం చూపించమని అడిగేడు…ఊరికే కాదు డబ్బులు ఇస్తం అని ఇంకొకయాన చెప్పాడు…

సరే అని బయలుదేరా వాళ్ళతో… వాళ్ళ సంచులు కొన్ని మొయ్యమని నకిచ్చారు…డబ్బులు ఇస్తన్నరని కాబోలు…నిజం చెప్పాలంటే డబ్బులకోసం కాదు…వాళ్ళతో పాటు వచ్చిన ఒక తెల్ల అమ్మాయి కోసం….

రెండ్రోజులు వాళ్ళతోనే వున్న….గుడారాలు వేసుకొని, అక్కడే వండుకొని, తిని, ఆడి, పాడి, బాగా మజా చేశారు…నేను మాత్రం ఆ తెల్ల తోలు పిల్లని చూస్తా కాలం గడిపేశా…

వెల్లేపుడు ఓ అయ్యిదిందలు చేతిలో పెట్టారు…వెళ్లేప్పుడు ఆ  తెల్ల అమ్మాయి చెయ్యి వూపుతూ వీడ్కోలు చెప్పింది…..కార్లు గూడెం దాటి వెళ్ళేదాకా అలా చూస్తుండిపోయా…..

మా గూడెం ….ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లో వున్న పర్లకిమిది దగ్గర్లో మారా గూడెం…

అడివిలో కొండల మధ్య స్వచ్ఛమైన అడివి తల్లి పిల్లలం.

అడివిలో కొండల మధ్య ఓ ముప్పై గుడిసెలు వుండే గూడెం మాది.. స్వచ్ఛమైన అడివి తల్లి పిల్లలం…గూడెం కి మూడు మైళ్ళ దూరంలో ఓ జలపాతం, అడవంతా టేకు చెట్లు, విప్ప చెట్లు, చీపురు చెట్లు, ఇస్తరకులు కుట్టె చెట్లు….వారానికి ఒక రోజు పది మైళ్ళ దూరం లోఉన్న చిన్న వూళ్ళో సంత….

గూడెం మొత్తం నూరు మంది కూడా లేని జనం. రోజులు గడుస్తున్నాయి, ప్రతి వారం  చాలా దూరం నుండి జలపాతం చూడటానికి, అడివి చూడటానికి సాన జనలోస్తున్నరు…

నాకు కొంచెం డబ్బులు వస్తున్నాయి….చలికాలం వచ్చింది…మనుషులు పెరిగారు. మా వూరు చాలా పెద్ద ఫెమస్ అయిపోయింది…ఈ మధ్యే ఒక   బాగా వున్న షావుకారు కుటుంబం తో సహా వచ్చి మూడ్రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు….నేను మాత్రం ఆ తెల్ల తోలు అమ్మాయి కోసం ఎదురుచూస్తూ వున్నా….

చలి కాలం కూడా అయిపోతుంది…

ఎప్పుడు రాని మా ఊరికి ఓ రోజు పోలీస్ జీప్ మూడు కార్లు వచ్చాయి…జీప్ లోంచి ఓ నలుగురు పోలేసోల్లు, ఎమ్మార్వో అంటా, అతను….ఇంకో పది మంది మనుషులు మా తాత దగ్గరి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు….గూడెం ఖాళీ చేసి వెళ్ళల్నాట, గవర్నమెంట్ వాళ్ళు  ఇక్కడ గెస్ట్ హౌస్ కడతరంట. మా గూడెం జనాలకి నోట మాట లేదు. వాళ్ళతో వచ్చిన ఇంజనీరు కొలతలు రాసుకొని వెళ్ళాడు.

ఎండా కాలం వచ్చింది. జలపాతం ఎండి పోయింది… టూరిస్ట్ లు రావడం బాగా తగ్గి పోయింది ….వచ్చే కొద్దీ మంది కూడా గంజాయి కోసం మత్రేమే వాకబు చెయ్యడం కోసం మాత్రమే వస్తున్నారు.. ఓ రోజు గూడెం  లో వున్నా మగాళ్లంతా ఇస్థరకులు,కుంకుడు కాయలు ఏరుకోటనికి అడివికి  వెళ్లారు…సాయంత్రం వచ్చే సరికి గూడెం లో వున్న ఆడాలంత అంగన్వాడీ కేంద్రం దగ్గర కూర్చుని వున్నారు….గూడెం లో ఎక్కడ దీపం వెలగడం లేదు…మా తాత ని చూసి కుంటి మోగలయ్య ఏడుస్తూ సెప్పెడు….. పది దిన్నల్లో గూడెం ఖాళీ సెయ్యలంట, ఎమ్మెల్యే ఆడి మనుషులు, ఓ కుర్ర యస్సై, ఎమ్మార్వో వచ్చి గూడెం లో మనుషుల్ని కొట్టి, అడల్ని తిట్టి వెళ్లారు…వచ్చే వర్షాల కల్ల బిల్డింగ్ కట్టలంట, మంత్రి గారి ఆదేశం అంటా…..

మోగలయ్య ఏడుస్తున్నాడు…..

తాత కి  మాట రావడం లేదు….ఆ రాత్రి ఎలా గడిసిందో ఎవరికి తెలియదు..

తాత దిగుల్తో జ్వరం పట్టెడు…ఆ రోజు సాయంత్రం మేఘాలు దట్టంగా అలుముకున్నాయి…రాత్రంతా తుఫాను లా ఒకటే వర్షం……

వేకువజాము వరకు అగాలే….కొంచెం తెల్లవారుతుండగ  వాన ఆగింది…..అంతలో గంజాయి అమ్మ్మే శీను గాడు సైకిల్ మీద పెద్ద గా అరుస్తూ గూడెం వైపొస్తున్నడు….తాత కూడా వాడి అరుపులకి లేచి వచ్చాడు…

ఆయాస పడ్తు శీను గాడు చెప్పాడు…. ఎమ్మెల్యే నీ, యేసై నీ, ఎమ్మేర్వో నీ, ఎవరో సంపేసి రహదారి బంగ్లా దగ్గర పడేసరంట…..వూళ్ళో ఒకటే జనం, పొలేసోల్లు….ఒకటే హడావుడి……

శీను గాడు సెప్తా ఉన్నాడు… తాత మాత్రం అంగన్వాడీ కేంద్రం పైన ఎగురుతున్న జండా   చూస్తా ఉన్నాడు….ఆ జండా నిన్న లేదు..ఇప్పుడు ఎలా వచ్చిందో నాకు తెలియదు….అక్కడ గోడ మీద రాసి వుంది…”గూడెం ఖాళీ చెయ్యాల్సిన అవసరం లేదు” అని….

తాత అన్నాడు…అందరూ దేవుళ్ళు తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు మాత్రం తీసుకుని ఈ ఎరుపు రంగు మాత్రం ఈ దేవుళ్ళకి ఎందుకు వదిలేసా రో  ఇప్పుడు అర్థం అయ్యింది రా అంటూ లోపలికి వెళ్ళి పోయాడు…ఈ మాట ఎందుకు అన్నాడో నాకు మాత్రం అర్థం కాలేదు….

నేను మాత్రం వానాకాలం ఎప్పుడొస్తుందా అని, ఆ తెల్ల అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నా……..